everyday: ఆరోగ్యం కోసం వీటికి కూడా కాస్త చోటివ్వండి..!
- రోజు 15-45 నిమిషాల పాటు వ్యాయామం
- పోషకాహారానికి చోటివ్వాలి
- కూరగాయలు, పీచు పదార్థాలు తీసుకోవాలి
- చక్కెర, టీలు, కాఫీలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి
- కంటి నిండా నిద్రపోవాలి
ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దీన్ని పట్టించుకోకుండా, మన ఇష్టాలు, కోరికలు, జీవనశైలి, తీరికలేని కారణాలతో మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఆరోగ్య సంరక్షణ మన చేతుల్లో ఉన్నప్పుడు, దాన్ని నిర్లక్ష్యం చేసి వైద్యుల చేతుల్లో పెట్టడం ఎందుకు? ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించాలి. ఆరోగ్యం కావాలంటే రోజువారీ కొన్నింటికి చోటు ఇవ్వాల్సిందే.
రోజులో కొంత సమయం పాటైనా సూర్య కిరణాలు మన శరీరాన్ని తాకాలి. అప్పుడు విటమిన్ డి సహజసిద్ధంగా మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. జీవక్రియల్లో, వ్యాధి నిరోధక శక్తిలో, ఎముకలకు కాల్షియం అందడంలో విటమిన్ డి పాత్ర ఎంతో ఉంటుంది.
మాంసాహారాన్ని తగ్గించాలి. మనిషి ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి మొక్కల ఆధారిత ఆహారానికే డైట్ లో ప్రధానంగా చోటు ఇవ్వాలని ఎన్నో అధ్యయనాలు సూచించాయి.
10 నిమిషాలు కావచ్చు లేదా 15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాలు ఎంత సమయం అయినా ఫర్వాలేదు. కానీ, ఎంతో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి. ఇంట్లోనే ఉండి కసరత్తులు చేసినా ఫర్వాలేదు. కంటి వ్యాయామాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఆచరించాలి. వారంలో కనీసం ఎంతలేదన్నా 150 నిమిషాలు వ్యాయామాలకు కేటాయించడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.
రోజువారీగా ఏ ఆహారం తీసుకుంటున్నారు? ఏ సమయానికి? అన్నవి ఒక రికార్డు నిర్వహించాలి. దీనివల్ల అనారోగ్యం కలిగినప్పుడు దేనివల్ల అలా జరుగుతుందన్నది గుర్తించడం సులభమవుతుంది. దాంతో అటువంటి వాటికి దూరంగా ఉండొచ్చు.
చక్కెరను దూరం పెట్టడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. కావాలంటే చక్కెరకు ప్రత్యామ్నాయాలైన స్టీవియా, తేనె, దాల్చిన చెక్కను వాడుకోవచ్చు.
చక్కెర పరిమాణం అధికంగా ఉండే శీతల పానీయాలు, టీ, కాఫీలను కూడా తగ్గించేయాలి. ముఖ్యంగా సాయంత్రం 5 దాటిన తర్వాత కెఫైన్ ఉన్న పదార్థాలను తీసుకోరాదు.
ప్రాణాయామం లేదా ధ్యానం అలవాటు చేసుకోవాలి. మనసుకు నచ్చిన సంగీతం వినడం కూడా ఆరోగ్యాన్నిస్తుంది. మెదడు శక్తి పెరుగుతుంది.
కార్యాలయాలు, అపార్ట్ మెంట్లలో లిఫ్ట్ లకు బదులు మెట్ల మార్గంలో వెళ్లడానికే ప్రయత్నించడం కూడా ఒక వ్యాయామం అవుతుంది.
ఆహారంలో పీచు పదార్థాలను చేర్చుకోవడం, కూరగాయల పరిమాణాన్ని పెంచి తీసుకోవడం, రోజులో కనీసం ఒక పండు తినడం మేలు చేస్తాయి.
ఇక చివరిగా కంటినిండా నిద్ర కావాలి. కనీసం 8 గంటల పాటు నిద్రించడం మంచి చేస్తుంది. అవకాశం లేకపోతే 6 గంటలకు నిద్ర తగ్గకుండా చూసుకోవాలి.