V Srinivas Goud: డ్రగ్స్ అమ్మితే నగర బహిష్కరణే.. పబ్‌ల యజమానులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
- పబ్‌లలో డ్రగ్స్ కనిపిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు
- అవసరమైతే నగర బహిష్కరణ కూడా విధిస్తాం
- మరీ అవసరమైతే ఈ వ్యవస్థ మొత్తాన్నిరద్దు చేస్తాం
- పబ్‌లతో వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ముఖ్యం కాదన్న శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఘటన నేపథ్యంలో తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం నగరంలోని పబ్‌ల యజమానులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు కూడా పాలు పంచుకున్న ఈ భేటీలో పబ్ యజమానులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పబ్‌లలో డ్రగ్స్ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
భేటీలో భాగంగా పలు పబ్‌లలో తరచూ డ్రగ్స్ పట్టుబడుతున్న వైనంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్‌లలో డ్రగ్స్ కనబడకూడదని చెప్పినా.. పదే పదే ఈ తరహా ఘటనలు రిపీట్ అవుతున్నాయన్న మంత్రి.. ఇకపై ఈ వ్యవహారంపై సీరియస్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ యాక్ట్‌లతో పాటు అవసరమైతే డ్రగ్స్ పట్టుబడే పబ్‌ల యజమానులకు నగర బహిష్కరణ విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే మొత్తం పబ్‌ల వ్యవస్థనే నగరంలో రద్దు చేస్తామని కూడా మంత్రి చెప్పారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్లంతా రాష్ట్రం విడిచిపోవాలన్న మంత్రి..పబ్‌లతో వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ముఖ్యం కాదని పేర్కొన్నారు. వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన సూచించారు. పబ్‌ల యజమానులు నిబంధనలు పాటించకపోతే ఎక్సైజ్ అధికారులే బాధ్యులు అవుతారని కూడా మంత్రి హెచ్చరించారు. మొత్తంగా డ్రగ్స్‌ను అరికట్టడానికి ఇటు పబ్‌ల యజమానులతో పాటు అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా మంత్రి సీరియస్ వార్నింగులే ఇచ్చారు.