Rajamouli: చెన్నైలో సీఐఐ సదస్సు... రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తిన మణిరత్నం!

Rajamouli and Sulumar attends CII seminar in Chennai

  • సదస్సును ప్రారంభించిన సీఎం స్టాలిన్
  • టాలీవుడ్ నుంచి హాజరైన రాజమౌళి, సుకుమార్  
  • రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకుంటానన్న మణిరత్నం 
  • కథే ముఖ్యమని నమ్ముతానన్న రాజమౌళి 

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో చెన్నైలో ఏర్పాటు చేసిన సదస్సుకు టాలీవుడ్ నుంచి అగ్రశ్రేణి దర్శకులు రాజమౌళి, సుకుమార్... కోలీవుడ్ నుంచి దర్శకుడు మణిరత్నం తదితరులు హాజరయ్యారు. సౌతిండియా ఫిలిం ఇండస్ట్రీ, మీడియా రంగం, తక్కువ బడ్జెట్ తో జనరంజక చిత్రాలు తీయడం ఎలా అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ, రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓ పెద్ద కథను తీసుకుని దాన్ని విజయవంతం చేయడం ఎలాగో రాజమౌళిని చూసి నేర్చుకోవాలన్నారు. పెద్ద కథను రెండు భాగాలుగా విభజించి కూడా సక్సెస్ ను అందుకోవడం రాజమౌళికే చెల్లిందన్నారు. ఈ విషయంలో తాను రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకుంటున్నానని తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా ఇప్పటి యువతకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయని, ఫోన్లలోనే సినిమాలు చిత్రీకరించి టాలెంట్ నిరూపించుకుంటున్నారని మణిరత్నం పేర్కొన్నారు. 

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ప్రతి కథను విస్తృతస్థాయిలో తెరకెక్కించేందుకు తాను ప్రాధాన్యత ఇస్తానని, అయితే అది చిన్న బడ్జెట్ సినిమానా, భారీ బడ్జెట్ సినిమానా అనేది పట్టించుకోనని అన్నారు. అన్నిటికంటే కథే ముఖ్యం అని నమ్ముతానని రాజమౌళి అన్నారు. 

అంతకుముందు, ఈ సదస్సును ప్రారంభించిన సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించేలా, స్ఫూర్తిదాయకంగా సినిమాలు ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
.

  • Loading...

More Telugu News