Pakistan: పాక్‌లో హైడ్రామా!.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ మరోమారు వాయిదా!
- తిరిగి ప్రారంభమైన పాక్ జాతీయ అసెంబ్లీ
- అవిశ్వాసంపై ఓటింగ్ ను వాయిదా వేసిన స్పీకర్
- ఓటింగ్ ఎప్పుడన్న దానిపై లేని క్లారిటీ
పాకిస్థాన్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం ఖరారైపోగా.. ఆ ముహూర్తం ఎప్పుడన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన ఇమ్రాన్ ఖాన్.. తన పదవిని కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు.
అయితే సుప్రీంకోర్టు జోక్యంతో జాతీయ అసెంబ్లీ తిరిగి పునరుద్ధరణ అయ్యింది. ఇమ్రాన్ సర్కారుపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను నిర్వహించేది లేదని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఇటీవల రూలింగ్ ఇవ్వగా.. అది చెల్లదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం సాయంత్రం ప్రారంభమైన జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ సర్కారుపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను వాయిదా వేస్తూ స్పీకర్ అసద్ ఖైసర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో మరోమారు పాక్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. తదుపరి ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.