Rohit Sharma: 151/6 మంచి స్కోర్ కాదు: రోహిత్ శర్మ
- బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్
- మేము చేసింది మంచి స్కోరు కానే కాదు
- అది కూడా సూర్యకుమార్ ఘనతే
- బ్యాటర్లు తమ వంతు రాణించాలన్న అభిప్రాయం
ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టు ఆటతీరు పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఏ మాత్రం సంతృప్తిగా లేడు. ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా ఒక్కటంటే ఒక్కదానిలోనూ గెలవలేకపోయింది. శనివారం బెంగళూరు జట్టు చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నది.
దీనిపై రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘151/6 అన్నది ఏ మాత్రం మంచి స్కోరు కాదు. బ్యాటర్లు తమ నైపుణ్యం మేరకు రాణించాల్సి ఉంది’’అని అభిప్రాయపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ ను మెచ్చుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నుంచి చెప్పుకోతగ్గ స్కోరు సాధించింది సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే. 37 బంతుల్లో 68 పరుగులు సాధించి జట్టు గౌరవ స్కోరు చేయడానికి కారణమయ్యాడు.
‘‘చక్కని కాంబినేషన్ తోనే వెళ్లాం. మా వద్దనున్న ప్లేయర్లలో మెరుగైన వారినే ఎంపిక చేసుకున్నాం. వీలైనంత మేర బ్యాటింగ్ చేయాలని అనుకోగా.. అవుట్ అవ్వాల్సి వచ్చింది. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా కానీ, అనవసర సమయంలో అవుట్ అయ్యాం. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై 150 పరుగులు అన్నవి మంచి స్కోరు నిజంగా కాదు. అది కూడా సూర్య ఘనతే. బ్యాట్స్ మెన్ తమవంతు పరుగులు రాబడితే అప్పుడు బౌలర్ల కృషి తోడవుతుంది’’అని శర్మ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.