IPL: ఐపీఎల్ లో అంపైరింగ్ నిర్ణయాలు వివాదాస్పదం... సెటైర్ వేసిన ఐస్ లాండ్ క్రికెట్ బోర్డు
- ఐపీఎల్ తాజా సీజన్ లో దారుణమైన అంపైరింగ్
- బ్యాట్స్ మెన్ కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు
- తప్పుడు నిర్ణయానికి కోహ్లీ సైతం బలి
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ
ఐపీఎల్ తాజా సీజన్ లో అంపైర్లు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ముంబయితో బెంగళూరు మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అవుట్ ఇచ్చిన తీరు అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. థర్డ్ అంపైర్ కూడా రీప్లేలో స్పష్టత లేదంటూ కోహ్లీ అవుట్ అని ప్రకటించాడు. దాంతో కోహ్లీ తీవ్ర నిరాశతో బ్యాట్ విసురుతూ పెవిలియన్ చేరాడు.
ఇదేకాదు, పలు మ్యాచ్ ల్లోనూ అంపైరింగ్ నిర్ణయాలు సందేహాస్పదంగా కనిపించాయి. దీనిపై ఐస్ లాండ్ దేశ క్రికెట్ బోర్డు స్పందించింది. తమ వద్ద బాగా శిక్షణ పొందిన అంపైర్లు ఉన్నారని, ఐపీఎల్ కు పంపించమంటారా..? అంటూ బీసీసీఐకి చురకలంటించిది.
"బ్యాట్ కు ఇన్ సైడ్ ఎడ్జ్ తగిలిందా లేదా... ముందు బ్యాట్ కు తగిలిందా లేక ప్యాడ్ కు తగిలిందా? అనేది గుర్తించడం మైదానంలోని అంపైర్లకు చాలా కష్టం. కానీ టీవీ అంపైర్లకు స్లో మోషన్ లో వీక్షించే అవకాశం ఉంటుంది కాబట్టి వారు సరైన నిర్ణయం తీసుకోవాలి. మా వద్ద సుశిక్షితులైన అంపైర్లు ఉన్నారు... మీరు ఊ అంటే విమానం ఎక్కిస్తాం" అంటూ ఐస్ లాండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.