Sri Lanka: శ్రీలంకను వీడి భారత్ కు వస్తున్న శరణార్ధులు
- శ్రీలంకలో దుర్భర పరిస్థితులు
- తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక
- తాజాగా తమిళనాడు తీరానికి చేరుకున్న 19 మంది
- 39కి చేరిన శ్రీలంక శరణార్థుల సంఖ్య
శ్రీలంకలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దలేక అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో, అక్కడి ప్రజలు భారత్ వైపు చూస్తున్నారు. శ్రీలంకలో సాధారణ పౌరులు ఏదీ కొనే స్థితి కనిపించడంలేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎంత డబ్బు పెట్టినా నిత్యావసరాలు అందని దుస్థితి నెలకొంది. చమురు ధరలు ఎప్పుడో అదుపుతప్పాయి. దానికితోడు తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది.
81 బిలియన్ డాలర్ల విలువైన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుంది. చేసిన అప్పులు చూస్తే, తమ వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యానికి మూడింతలు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందడంలేదు.
ఈ నేపథ్యంలో, శ్రీలంక నుంచి భారత్ కు వస్తున్న శరణార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, శ్రీలంకలోని జాఫ్నా, మన్నార్ ప్రాంతాల నుంచి 19 మంది తమిళనాడులోని ధనుష్కోడి చేరుకున్నారు. వారంతా ఓ బోటులో వచ్చారు. భారత్ లో ఆశ్రయం కోసం వారు దేశాన్ని వీడామని, శ్రీలంకలో సాధారణ జీవనం అత్యంత కష్టసాధ్యంగా మారిపోయిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. గత కొన్నిరోజుల వ్యవధిలో శ్రీలంక నుంచి తమిళనాడు తీరానికి చేరుకున్న వారితో కలిపి శరణార్థుల సంఖ్య 39కి పెరిగింది.
.