Alexander Dvorknikov: అత్యంత క్రూరుడైన సైనిక జనరల్ కు ఉక్రెయిన్ బాధ్యత అప్పగించిన పుతిన్
- ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- ఇప్పటికీ తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్
- కీలక నిర్ణయం తీసుకున్న పుతిన్
- ఇకపై అలెగ్జాండర్ దివొర్నికోవ్ నేతృత్వంలో దాడులు
- గతంలో సిరియాలో నరమేధం
- దివొర్నికోవ్ పనే అంటున్న అమెరికా
ఫిబ్రవరి 24 నుంచి ముమ్మర దాడులు చేస్తున్నా ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యా అధినాయకత్వం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై దాడుల బాధ్యతను అనుభవజ్ఞుడైన సైనిక జనరల్ అలెగ్జాండర్ దివొర్నికోవ్ కు అప్పగించారు.
60 ఏళ్ల దివొర్నికోవ్ అత్యంత క్రూరుడైన సైనికాధికారిగా పేరుగాంచారు. గతంలో సిరియాలోనూ, అనేక యుద్ధ రంగాల్లోనూ సాధారణ పౌరులను కూడా వదలకుండా ఊచకోత కోసిన ఘనచరిత దివొర్నికోవ్ సొంతమని అమెరికా సైన్యం చెబుతోంది. రష్యా సైన్యంలో ప్లటూన్ కమాండర్ గా ప్రస్థానం ఆరంభించిన దివొర్నికోవ్ ఆపై సైన్యంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో ఆయనను 'హీరో ఆఫ్ రష్యా' పురస్కారం కూడా వరించింది.
ఇప్పటికే రష్యా దళాలు ఉక్రెయిన్ భూభాగంపై అనేక అకృత్యాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు దివొర్నికోవ్ సారథ్యంలో ఇంకెన్ని అఘాయిత్యాలు జరుగుతాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.