Elon Musk: ట్విట్టర్ యాజమాన్య బోర్డులోకి వెళ్లరాదని ఎలాన్ మస్క్ నిర్ణయం
- ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ కు 9.2 శాతం వాటాలు
- ట్విట్టర్ వ్యవస్థాపకుడి వాటా కంటే 4 రెట్లు అధికం
- మస్క్ మంచి నిర్ణయం తీసుకున్నారన్న ట్విట్టర్ సీఈవో
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన ఎలాన్ మస్క్ (50) కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ యాజమాన్య బోర్డులోకి వెళ్లరాదని ఆయన నిర్ణయించుకున్నారని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ వెల్లడించారు. ట్విట్టర్ లో ప్రస్తుతం ఎలాన్ మస్క్ కు 9.2 శాతం వాటా ఉంది. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ వాటాల కంటే ఇది నాలుగు రెట్లు అధికం.
వాస్తవానికి శనివారం నాడు ట్విట్టర్ బోర్డులోకి ఎలాన్ మస్క్ లాంఛనంగా ప్రవేశిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ, మస్క్ ఎంతో మేలైన నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ట్విట్టర్ తన కార్పొరేట్ లక్ష్యాలపై మరింతగా దృష్టి సారిస్తుందని తెలిపారు.
అయితే, ట్విట్టర్ లో ఇతర వాటాదారులు మస్క్ నిర్ణయంపై ఆందోళన చెందుతున్నారని వివరించారు. బోర్డులో ఉన్నప్పటికీ, లేనప్పటికీ తమ వాటాదారుల అభిప్రాయాలకు తాము ఎప్పటికీ విలువ ఇస్తామని, ఇప్పటివరకు ఇచ్చామని కూడా అగర్వాల్ స్పష్టం చేశారు.