Eluru District: ఏపీలో షాకింగ్ ఘటన.. ఎస్సైను చితకబాదిన పేకాటరాయుళ్లు!
- ఏలూరు జిల్లా యడవల్లిలో ఘటన
- ఎస్సైని పరిగెత్తించి కొట్టిన పేకాటరాయుళ్లు
- వ్యక్తిగత కక్షలతో దాడి చేశారన్న సీఐ
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో పేకాటరాయుళ్లు, కోడి పందేలరాయుళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ఎస్సైని పరిగెత్తించి, కిందకు తోసి, చొక్కా లాగి కొట్టారు. ఈ ఘటన లింగపాలెం మండలం, యడవల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే యడవల్లిలో గత కొన్ని రోజులుగా పేకాట, కోడిపందేలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలియడంతో ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారు. దీంతో, వారిద్దరిని పందెంరాయుళ్లు దుర్భాషలాడాడు. ఈ విషయాన్ని స్థానిక ఎస్సైకి కానిస్టేబుళ్లు తెలిపారు.
దీంతో, వెంటనే మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో ఏఎస్సై రాంబాబు అక్కడకు వెళ్లారు. పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా.. వారు తిరగబడ్డారు. దీంతో, ఎస్సై దుర్గామహేశ్వరరావుకు ఏఎస్సై సమాచారం అందించారు. ఈ క్రమంలో ఎస్సై అక్కడకు చేరుకున్నారు.
దీంతో, పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న స్థానికులు ఎస్సైపై దాడి చేశారు. ఆయనను పరిగెత్తించారు. కిందకు తోసేసి, చొక్కా లాగి కొట్టారు. ఈ ఘటనలో ఎస్సైకి గాయాలయ్యాయి. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అక్కడకు వెళ్లిన సీఐ మల్లేశ్వరరావు గాయపడిన ఎస్సైని చికిత్స కోసం చింతలపూడి ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత కక్షతో ఎస్సైపై దాడి చేశారని చెప్పారు. దాడి చేసిన వారిలో కొందరిని గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎస్సైపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.