Communal Clashes: శ్రీ రామ నవమి వేళ నాలుగు రాష్ట్రాల్లో మత కలహాలు.. ఒకరి మృతి
- గుజరాత్ లోని ఖంభత్ లో శోభాయాత్రపై దాడి
- దాడుల్లో 65 ఏళ్ల వృద్ధుడి మృతి
- మధ్యప్రదేశ్ ఖర్గోనేలో టియర్ గ్యాస్ ప్రయోగం
- సిటీ మొత్తం కర్ఫ్యూ విధించిన అధికారులు
- పశ్చిమ బెంగాల్ హౌడాలో యాత్రపై రాళ్ల దాడి
- ఝార్ఖండ్ లో యాత్రకు వెళుతున్న యువకులపై దాడి చేసిన దుండగులు
శ్రీ రామ నవమి పండగ వేళ నిన్న దేశంలోని పలు రాష్ట్రాల్లో మతకలహాలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో శోభా యాత్ర సందర్భంగా రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పలు చోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
గుజరాత్ లో..
శ్రీరాముడి శోభా యాత్ర సందర్భంగా గుజరాత్ లోని ఖంభత్ లో ఓ వర్గం వారు రాళ్లు రువ్వారు. ప్రతిగా మరో వర్గం వారూ రాళ్లు రువ్వడంతో పరిస్థితి విషమించింది. రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనలో ఒక 65 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టారు. వాహనాలను రోడ్డుపై తగులబెట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, దర్యాప్తు చేస్తున్నామని ఖంభత్ ఎస్పీ అజీత్ రాజ్యన్ చెప్పారు.
హిమ్మత్ నగర్ లోనూ రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. షాపులు, వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చామని సబర్కంథ ఎస్పీ విశాల్ వాఘేలా చెప్పారు. అదనపు బలగాలను మోహరించామన్నారు.
మధ్యప్రదేశ్ లో..
రాష్ట్రంలోని ఖర్గోనేలో రాములోరి శోభాయాత్రపైకి కొందరు రాళ్లు విసిరారు. రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ (బాష్ప వాయువు) ప్రయోగించారు. ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారని ఖర్గోనే అదనపు కలెక్టర్ సుమేర్ సింగ్ ముజాల్దే చెప్పారు. ఘర్షణల్లో ముగ్గురు పోలీసులూ గాయపడ్డారని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఘర్షణ వాతావరణంతో ఖర్గోనే సిటీ మొత్తం కర్ఫ్యూ విధించారు.
పశ్చిమ బెంగాల్ లో...
పశ్చిమబెంగాల్ లోని హౌడాలో రామనవమి యాత్రపై దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. అయితే, రామనవమి యాత్రపై పోలీసులే దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. సున్నితమైన అంశాలపై అనవసర వ్యాఖ్యానాలు చేయవద్దంటూ ప్రజలకు పోలీసులు ఆదేశాలిచ్చారు.
ఝార్ఖండ్ లో..
శోభా యాత్ర కోసం వెళుతున్న కొందరు యువకులపై మరో వర్గం వారు దాడి చేసిన ఘటన ఝార్ఖండ్ లోని బొకారోలో జరిగింది. యాత్రకు వెళుతున్న యువకులపై రాళ్ల దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. గొడవ పెద్దది కాకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలనూ శాంతింపజేశారు.
లోహర్దాగాలో జరిగిన కలహాల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పది బైకులు, ఓ పికప్ వాహనాన్ని దుండగులు తగులబెట్టారు. శోభాయాత్రపైకి ఓ వర్గం వారు రాళ్లు విసిరారని, దీంతో ఎదుటి వర్గం వారూ ప్రతిగా రాళ్లదాడికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా ఘటనాస్థలిలో భారీగా బలగాలను మోహరించారు.