Botsa Satyanarayana: బొత్స రూటే సెపరేటు.. ప్రమాణస్వీకారంలో ప్రత్యేకత చూపించిన మంత్రి!
- ప్రమాణం చేసిన తర్వాత తొలుత జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఇతర మంత్రులు
- ప్రమాణం తర్వాత నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లిన బొత్స
- ఈ తర్వాత జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి కదిలిన వైనం
వైసీపీలో ఎంతో మంది కీలక నేతలు ఉన్నప్పటికీ మంత్రి బొత్స సత్యనారాయణది ఒక విలక్షణమైన శైలి అని చెప్పడంలో ఎలాంటి అతిశయం లేదు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ఆయనకు పార్టీలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇతర మంత్రులతో పోల్చినా... బొత్స వ్యవహరించే తీరు అందరికీ అతీతంగా ఉంటుంది.
ఈరోజు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో సైతం బొత్స 'నా రూటే సెపరేటు' అన్నట్టుగా వ్యవహరించారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులందరూ... సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా... ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలుత సీఎం జగన్ వద్దకు వెళ్లి ధన్యవాదాలు చెప్పుకున్నారు. వీరిలో చాలామంది జగన్ కు పాదాభివందనం కూడా చేశారు. అనంతరం గవర్నర్ వద్దకు వెళ్లి ధన్యవాదాలు చెప్పారు.
అయితే బొత్స మాత్రం... ప్రమాణం చేసిన వెంటనే జగన్ ను దాటుకుంటూ వెళ్లి గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జగన్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంతేకాదు, చాలా చనువుగా సీఎం భుజం మీద కూడా చేయి వేశారు. అక్కడి నుంచి కదిలారు. మొత్తం ప్రమాణస్వీకార కార్యక్రమంలో బొత్స తీరు హైలైట్ గా నిలవడం గమనార్హం.
వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కీలక బాధ్యతలను చేపట్టిన బొత్స... జగన్ ప్రభుత్వంలో సైతం కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా వ్యవహరించారు. ఉత్తరాంధ్రలో ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.