Sajjala Ramakrishna Reddy: నేతల అలకలపై సజ్జల ఏమన్నారంటే...?
- అసంతృప్తులు నిజమేనన్న సజ్జల
- అవన్నీ తాత్కాలికమేనంటూ వ్యాఖ్య
- పార్టీ విధానాన్ని వివరిస్తున్నామని కామెంట్
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైసీపీలో పెద్ద ఎత్తున అసంతృప్తి వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో పదవులు దక్కలేదన్న భావనతో తాజా మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరితలతో పాటు మంత్రి పదవులు ఆశించిన సామినేని ఉదయభాను, శ్రీనివాసులు తదితర నేతల అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అలకబూనిన నేతలను బుజ్జగించే యత్నాలను పార్టీ అధిష్ఠానం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో నేతల అసంతృప్తులపై వైసీపీ కీలక నేత, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. అసంతృప్తులు వాస్తవమేనని చెప్పిన ఆయన, అవన్నీ తాత్కాలికమేనని అన్నారు. పదవులు దక్కని కొందరు అలకబూనిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న ఆయన వారిని బుజ్జగిస్తామన్నారు. ఓ విధాన నిర్ణయం మేరకే కొందరు నేతలకు అర్హత ఉన్నా కూడా మంత్రి పదవులు ఇవ్వలేకపోయిన వైనాన్ని పార్టీ నేతలకు వివరిస్తున్నామని చెప్పారు. త్వరలోనే అసంతృప్తులు చల్లారిపోతాయని చెప్పుకొచ్చారు.