Komatireddy Venkat Reddy: కుటుంబ పాలన వల్లే శ్రీలంకలో సంక్షోభం... తెలంగాణలోనూ అదే పరిస్థితి రావొచ్చు: కోమటిరెడ్డి
- కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి
- సీఎం కేసీఆర్ పాలనపై విమర్శనాస్త్రాలు
- తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని వ్యాఖ్య
- కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉండాలని పిలుపు
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ లో మారిన పరిణామాల నేపథ్యంలో, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పై పోరాటభేరి మోగించారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమితులైన కోమటిరెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కుటుంబ పాలన కారణంగానే శ్రీలంకలో తీవ్ర సంక్షోభం తలెత్తిందని, భవిష్యత్తులో తెలంగాణలోనూ అదే పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు.
రాబోయే రోజుల్లో గ్రామగ్రామాన సభలు ఏర్పాటు చేసి కేసీఆర్ దోపిడీని బట్టబయలు చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అయితే, కలిసికట్టుగా లేకపోతే కేసీఆర్ ను ఢీకొట్టలేమని అభిప్రాయపడ్డారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా, అందరూ ఏకతాటిపై నిల్చినప్పుడే కేసీఆర్ ను ఎదుర్కోగలమని స్పష్టం చేశారు.
అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తామని వివరించారు. వారిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.