Ukraine: అత్యాచారం కూడా రష్యా సేనలకు ఒక ఆయుధమే: ఐరాసకు తెలిపిన ఉక్రెయిన్ హక్కుల సంఘం
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
- మహిళలు, బాలికలపై రష్యా సేనల దురాగతాలు
- బయటికి రాని సంఘటనలు చాలా ఉన్నాయన్న హక్కుల సంఘం
ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యా సేనలు అనేక దారుణాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, మహిళలు, బాలికలపై రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ ఉక్రెయిన్ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా, ఉక్రెయిన్ కు చెందిన లా స్ట్రాడా-ఉక్రెయిన్ అనే మానవ హక్కుల సంఘం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లా స్ట్రాడా-ఉక్రెయిన్ సంస్థ అధ్యక్షురాలు కాటరీనా చెరెపఖా దీనిపై స్పందిస్తూ, రష్యా సైనికులు 12 మంది ఉక్రెయిన్ మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన 9 ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు.
ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమేనని, ఇంకా పెద్ద సంఖ్యలో రష్యన్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యన్ సైనికులు అత్యాచారం చేయడాన్ని ఓ అయుధంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆమె ఐక్యరాజ్యసమితి అధికారికి తెలియజేశారు. కాటరీనా చెరెపఖాను ఉటంకిస్తూ, రష్యన్ సేనల అత్యాచార పర్వాన్ని ఆ ఐరాస అధికారి భద్రతామండలికి నివేదించారు.
కాగా, రష్యా మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఉక్రెయిన్ లో తాము సాధారణ పౌరుల జోలికి వెళ్లడంలేదని అంటోంది.