Sri Lanka: ‘రాజపక్స కుటుంబం’ అధికారం నుంచి దిగేదే లేదు: తేల్చి చెప్పిన శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స
- జాతినుద్దేశించి తొలి ప్రసంగం
- నిరసనలు ఆపాలని పిలుపు
- డాలర్లను నష్టపోతామని హితవు
- ప్రతిక్షణం విలువైనదేనని కామెంట్
శ్రీలంకలో తిండికి, చమురుకు పడుతున్న కష్టాలను భరించలేక ప్రజలు ఇంకా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మహీంద రాజపక్స స్పందించారు. ఎన్ని రోజులు రోడ్డెక్కి ఎంత తీవ్రంగా నిరసనలు చేస్తే.. అంతే తీవ్రంగా, వేగంగా డాలర్లను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డాలర్లను కాపాడుకోవడంలో ప్రతిక్షణం విలువైనదేనని ప్రజలకు సూచించారు. నిన్న రాత్రి ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాగా, ప్రధాని అయిన దగ్గర్నుంచి ప్రజలకు ఆయన నేరుగా సందేశమివ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
యువకులు రోడ్డెక్కి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినంత మాత్రాన రాజపక్స కుటుంబం అధికారం నుంచి దిగేదే లేదని స్పష్టం చేశారు. ఎల్టీటీఈ బారి నుంచి దేశాన్ని కాపాడిన ఘనత తమదేనన్నారు. తమకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలు ప్రశాంతంగానే జరుగుతున్నాయన్నారు.
కానీ, ఇంతకుముందు 1970, 1980ల్లో జనతా విముక్తి పేరమునా (జేవీపీ), తమిళ మిలిటెన్సీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు హింస, అల్లర్లకు కారణమయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు నిరసనలు చేస్తున్న వారంతా జాతి వ్యతిరేకులేనని మండిపడ్డారు. దేశంలోకి డాలర్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామ్యం, పాలన నిర్మాణం, దాని అధికారాన్ని కించపరిచేలా ప్రవర్తించే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులకు ఎరువుల సబ్సిడీని పునరుద్ధరిస్తామని రాజపక్స హామీ ఇచ్చారు. ఎప్పట్నుంచో రైతులకు ఎంతో మేలు చేశామని, ఇప్పుడు వారే తమకు వ్యతిరేకంగా నిలబడ్డారని అన్నారు. సేంద్రియ ఎరువుల వాడకం ఇప్పుడు సరైనది కాదని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోందన్నారు. కాబట్టి ఇకపై రసాయన ఎరువుల సబ్సిడీని అందజేస్తామని పేర్కొన్నారు.
కరోనా వల్ల పర్యాటక రంగం కుదేలయ్యి దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిందని, దానికి పన్నుల సంస్కరణలు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.