Telangana: తెలంగాణలో మరో పెట్టుబడి.. ‘వ్యాక్సిన్ హబ్’గా హైదరాబాద్ సార్థకం అవుతుందన్న కేటీఆర్
- జీనోమ్ వ్యాలీలో బీఎస్ వీ గ్లోబల్ పెట్టుబడులు
- రూ.200 కోట్లతో ఇంజెక్షన్లు, వ్యాక్సిన్ల తయారీ ప్లాంట్
- ట్విట్టర్ లో అధికారికంగా వెల్లడించిన మంత్రి
తెలంగాణలో మరో కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. బీఎస్ వీ గ్లోబల్ అనే సంస్థ హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లను తయారు చేసే యూనిట్ ను నెలకొల్పనుంది. ఇవాళ ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
రూ.200 కోట్లతో సంస్థ ఆ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. సంస్థ పెట్టుబడులతో హైదరాబాద్ కు వ్యాక్సిన్ హబ్ అనే పేరు సార్థకం అవుతుందని చెప్పారు. సంస్థ ఎండీ సంజీవ్ స్నావన్ గుల్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఇటీవల కేటీఆర్ అమెరికాలో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. క్వాల్కమ్, క్యాలవే, ఫిస్కర్ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిన సంగతి విదితమే. ఫిష్ఇన్ అనే సంస్థ మిడ్ మానేరులో చేపల ప్రాసెసింగ్ యూనిట్ ను పెడతామని హామీ ఇచ్చింది.