arvind: బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి ముందు ట్రాక్టర్‌తో వడ్లు పోసిన వీడియో వైరల్.. వారు రైతులు కాదన్న అరవింద్
- వారందరినీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పంపారన్న అరవింద్
- వారు దినసరి కూలీలని వ్యాఖ్య
- బీజేపీపై జీవన్ రెడ్డి విమర్శలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి ముందు కొందరు ట్రాక్టర్‌తో వచ్చి వడ్లు పోయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అరవింద్ స్పందించారు. ''మా ఇంటి ముందుకు వచ్చిన వారు నిజమైన రైతులు కాదు.. వారందరూ టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పంపిన దినసరి కూలీలు'' అని అరవింద్ మీడియాకు చెప్పారు.
దీనిపై జీవన్ రెడ్డి స్పందిస్తూ... తెలంగాణపై బీజేపీ సవతి తల్లి ప్రేమ కనబర్చుతోందని, రాష్ట్ర రైతులు అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. ''మా రైతుల హక్కుల కోసం మేము పోరాడతాం. ఒకే దేశం- ఒకే విధంగా ధాన్యం సేకరణపై మేము చేసిన డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అలాగే, తెలంగాణ నుంచి వరిని ఎప్పుడు కొంటారన్న విషయాన్నీ చెప్పాలి'' అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.