Telangana: టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల బాహాబాహీ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస
- పోడియం వద్ద రెండు పార్టీల నేతల హంగామా
- సీటు నుంచి లేచి నచ్చజెప్పిన మేయర్ విజయలక్ష్మి
- వార్షిక బడ్జెట్ సందర్భంగా టీఆర్ఎస్ కార్పొరేటర్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సమావేశం రసాభాసగా సాగింది. జీహెచ్ఎంసీ బడ్జెట్ ను ప్రవేశపెట్టే సందర్భంగా మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య బాహాబాహీకి కారణమైంది.
గోధుమలకు, వరికి తేడా తెలియని నేతలంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు కామెంట్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్పొరేటర్ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో ఇటు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పోడియం వద్దకు వెళ్లి పోటీ నిరసనలు చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య బాహాబాహీ దాకా వెళ్లింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మేయర్ సీట్ లో నుంచి లేచి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆందోళనను విరమించాలని ఇరుపార్టీల నేతలకు చెప్పారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామంటూ బీజేపీ నేతలకు మేయర్ హామీ ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల నేతలు శాంతించారు.
కాగా, మేయర్ విజయలక్ష్మి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సిందిగా సభను కోరారు. అభివృద్ధి, వసతుల కల్పనలో హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధిస్తోందన్నారు. 2022–23కి సంబంధించి రూ.6,150 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. రోడ్ల అభివృద్ధి, స్కైవేలు, ఫ్లై ఓవర్ల కోసం రూ.1,500 కోట్లు కేటాయించామన్నారు.
ఎస్ఎన్డీపీలో భాగంగా చేపడుతున్న పనులకు రూ.340 కోట్లు, నాలా అభివృద్ధికి రూ.200 కోట్లు, వరద నివారణల కోసం రూ.340 కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెంచేందుకు రూ. 332.23 కోట్లను కేటాయించామన్నారు.