Ravishastri: ధోనీపై రవిశాస్త్రి కోపగించుకున్న వేళ...!
- గతంలో టీమిండియా కోచ్ గా వ్యవహరించిన రవిశాస్త్రి
- ఇటీవలే ముగిసిన పదవీకాలం
- ప్రస్తుతం ఐపీఎల్ లో కామెంటేటర్ గా శాస్త్రి
- ఆసియా కప్ ఫైనల్ నాటి సంగతులు వెల్లడించిన వైనం
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఎంతో సరదా మనిషి. ఆయన కోచ్ గా తప్పుకున్న వేళ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారంటే ఆయన వారితో ఎంతలా కలిసిపోయారో అర్థమవుతోంది. అలాంటి రవిశాస్త్రి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై కోప్పడ్డారంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే రవిశాస్త్రి ఆగ్రహం వెనుక ఆందోళన ఉంది.
అసలేం జరిగిందో రవిశాస్త్రి మాటల్లోనే... "ధోనీ ఫుట్ బాల్ ఆడడాన్ని ఎంతో ఆస్వాదిస్తాడు. అయితే అతడు ఆడే విధానం చూస్తే ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే, ఫుట్ బాల్ ఆడేటప్పుడు గాయపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓసారి ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ తో టీమిండియా తలపడుతోంది. ఆ మ్యాచ్ కు ఇంకాసేపట్లో టాస్ వేస్తారనగా, ధోనీ ఫుట్ బాల్ ఆట మొదలుపెట్టాడు. అది కూడా మామూలుగా కాదు... సీరియస్ గా ఆడుతున్నాడు.
ఈ సమయంలో అతడు ఫుట్ బాల్ ఆడుతూ గాయపడితే..? అసలే పాకిస్థాన్ తో ఫైనల్ మ్యాచ్! ధోనీ లేకుండా ఎలా...? ఆ ఆలోచన రావడమే ఆలస్యం... వెంటనే ధోనీపై గట్టిగా అరిచాను. ఫుట్ బాల్ ఆపేయాలంటూ కోప్పడ్డాను. నా జీవితంలో ఎప్పుడూ ఎవరిపైనా అంతలా ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ ఎంతో కీలక మ్యాచ్ కు ముందు ధోనీ అంత తీవ్రతతో ఫుట్ బాల్ ఆడుతుండడాన్ని చూడలేకపోయాను" అని రవిశాస్త్రి వివరించారు.