CM Jagan: సీఎం ఎంత చెబితే అంత... జగన్ తో ముగిసిన అసంతృప్త నేతల సమావేశం

CM Jagan held meeting with part MLAs

  • మంత్రివర్గంలో పలువురికి దక్కని స్థానం
  • అసంతృప్తులతో సీఎం జగన్ భేటీ
  • క్యాంపు కార్యాలయానికి వచ్చిన పిన్నెల్లి, ఉదయభాను, పార్థసారథి 

కొత్త మంత్రివర్గంలో స్థానం ఆశించి, మనస్తాపానికి గురైన వైసీపీ అసంతృప్త నేతలతో సీఎం జగన్ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ ను కలిసిన అనంతరం ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుతో మంత్రి పదవి వస్తుందని ఆశించానని వెల్లడించారు. కానీ, మంత్రి పదవి రాకపోవడంతో బాధపడ్డానని తెలిపారు. అయితే పార్టీ ముఖ్యమని, 2024లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని సీఎం జగన్ చెప్పారని సామినేని వివరించారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీపైనా, పవన్ కల్యాణ్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. జనసేన ఓ షేరింగ్ పార్టీ అని, పవన్ కల్యాణ్ ఒక పార్ట్ టైమ్ రాజకీయ నేత అని పేర్కొన్నారు.

సీఎం జగన్ ఇవాళ సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథిలతో భేటీ నిర్వహించారు. వారికి పరిస్థితిని వివరించి నచ్చజెప్పారు. భేటీ అనంతరం పార్థసారథి మాట్లాడుతూ, మంత్రి పదవి రాలేదని తన మద్దతుదారులు బాధపడ్డారని వివరించారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని సీఎం చెప్పారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. 

పిన్నెల్లి మాట్లాడుతూ... తమ టార్గెట్ 2024 ఎన్నికలేనని, ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తామని చెప్పారు. సీఎం జగన్ ఏది చేసినా పార్టీ మేలు కోసమే చేస్తారని వెల్లడించారు. నాడు ఆయన బీ-ఫాం ఇవ్వబట్టే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని వివరించారు. తాజా సమావేశంలో ఆయన నుంచి ఎలాంటి హామీ తీసుకోలేదని, తమకు హామీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని సీఎం పట్ల తన విధేయతను చాటుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం ఇచ్చినందున, సీనియర్లకు మంత్రివర్గంలో చోటివ్వలేకపోయామని సీఎం వివరించారని పిన్నెల్లి తెలిపారు.

  • Loading...

More Telugu News