Nagababu: మిగిలిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం పూర్తి పరిహారం చెల్లించాలి: నాగబాబు డిమాండ్
- అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన
- కౌలు రైతుల కుటుంబాలకు సాయం
- పవన్ ఐదు కుటుంబాలను కలిశారన్న నాగబాబు
- లక్ష చొప్పున ఇచ్చినట్టు వివరణ
- ఆ 5 కుటుంబాలకు ప్రభుత్వం రూ.7 లక్షలు ఇచ్చిందని స్పష్టీకరణ
అనంతపురం జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన, తదనంతర పరిణామాలపై జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 29 మంది కౌలురైతులను గుర్తించి వారి కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆ విధంగా ఐదుగురు కౌలు రైతుల నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు రూ.1 లక్ష చొప్పున ఇచ్చినట్టు తెలిపారు.
సమయం లేనందున, మిగిలిన 24 మంది రైతుల కుటుంబాలకు దగ్గరగా ఉన్న ఓ గ్రామాన్ని ఎంచుకుని అక్కడ ఒక సభను ఏర్పాటు చేసి పలు కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఇచ్చామని తెలిపారు.
అయితే, తాము ఏ ఐదు కుటుంబాలకైతే లక్ష చొప్పున ఇచ్చామో, ఆ కుటుంబాల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.7 లక్షల పరిహారాన్ని చెల్లించడం ఆశ్చర్యం కలిగించిందని నాగబాబు తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ నియమాల ప్రకారం మిగిలిన 24 కుటుంబాలకు కూడా రూ.7 లక్షల పూర్తి పరిహారాన్ని చెల్లించాలని జనసేన తరఫున, కౌలు రైతుల కుటుంబాల తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.