RCB: ఎట్టకేలకు ఖాతా తెరిచిన చెన్నై.. బెంగళూరుపై విజయం
- నాలుగు వరుస పరాజయాల తర్వాత చెన్నైకి తొలి విజయం
- బౌలర్లను ఊచకోత కోసిన ఊతప్ప, దూబే
- ఆపై బౌలర్ల వీర విజృంభణ
- నాలుగు వికెట్లు తీసి బెంగళూరును దారుణంగా దెబ్బతీసిన తీక్షణ
- శివం దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
నాలుగు వరుస పరాజయాల తర్వాత చెన్నై ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై అన్ని విభాగాల్లోనూ రాణించి విజయాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది తొలి విజయం కావడం గమనార్హం. తొలుత శివం దూబే, రాబిన్ ఊతప్ప బౌలర్లను ఊచకోత కోసి 216 పరుగుల భారీ స్కోరు సాధిస్తే, ఆ తర్వాత బౌలర్లు తమ పని పూర్తి చేశారు. జడేజా సేనను 193 పరుగులకే కట్టడి చేశారు. ఫలితంగా చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. శివం దూబే, రాబిన్ ఊతప్ప బౌలర్లను బెంబేలెత్తించారు. బంతి వేయడమే పాపమన్నట్టుగా విరుచుకుపడ్డారు. దొరికిన బంతిని దొరికినట్టుగా స్టాండ్స్‌లోకి తరలించారు. ఫలితంగా స్కోరు బోర్డు ఉరకలెత్తింది. దూబే 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 (నాటౌట్) పరుగులు చేయగా, ఊతప్ప 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు.
అనంతరం 217 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరును చెన్నై స్పిన్నర్లు తీక్షణ, జడేజా కుదురుకోనివ్వలేదు. ఇద్దరూ కలిసి ఏడు వికెట్లు పడగొట్టి బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశారు. వీరిద్దరి దెబ్బకు బెంగళూరు జట్టు 50 పరుగులకే కెప్టెన్ డూప్లెసిస్ (8), విరాట్ కోహ్లీ (1), అనూజ్ రావత్ (12), మ్యాక్స్‌వెల్ (26) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో షాబాద్ అహ్మద్, సుయాశ్ ప్రభుదేశాయ్ కాసేపు నిలదొక్కుకుని స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. షాబాజ్ 27 బంతుల్లో 4 ఫోర్లతో 41, సుయాశ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు చేశారు. అయితే, వీరిద్దరినీ తీక్షణ పెవిలియన్‌కు పంపడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది.
ఆ తర్వాత దినేశ్ కార్తీక్ మెరుపులు కూడా జట్టును కాపాడలేకపోయాయి. 14 బంతులు ఆడిన కార్తీక్ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. మరో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద జడేజాకు దొరికిపోవడంతో ఆర్సీబీ ఓటమి లాంఛనమే అయింది. 20 ఓవర్లు ఆడిన ఆర్సీబీ 193 పరుగులు మాత్రమే చేసి విజయానికి 24 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చెన్నై బౌలర్లలో మహీశ్ తీక్షణకు 4, కెప్టెన్ జడేజాకు మూడు వికెట్లు దక్కాయి. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శివం దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.