Ambati Rayudu: మతి పోగొడుతున్న అంబటి రాయుడి ఫీల్డింగ్.. అద్భుతమైన క్యాచ్
- చేపపిల్లలా మారిపోయిన అంబటి రాయుడు
- సాధ్యం కాని రీతిలో బంతిని పట్టేసుకున్న తీరు
- మెచ్చుకుంటున్న అభిమానులు
- ఫీల్డింగ్ అంటే ఇలా ఉండాలంటూ ప్రశంసలు
ఫీల్డింగ్ అద్భుతం అంటే ఇదే. నవీ ముంబైలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మంగళవారం నాటి మ్యాచ్ ఇందుకు వేదికగా నిలిచింది. 36 ఏళ్ల వయసులో అంబటి రాయుడు చేసిన డైవింగ్ క్యాచ్ చూసే వారి కళ్లు నమ్మలేని విధంగా ఉంది. అసాధారణం, అద్భుతం అనేలా బాల్ ను పట్టేసుకుని అభిమానులతో ‘శభాష్ రాయుడు నీకు ఎవరు సాటిరారు’ అనిపించుకుంటున్నాడు.
ఈ సీజన్ లో సీఎస్కేకు తొలి విజయం రాయల్ చాలెంజర్స్ పై లభించింది. 23 పరుగుల తేడాతో చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుండగా 16వ ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేశాడు. ఆ బాలు వాస్తవానికి వికెట్ల ముందే ఆగిపోవాలి. కానీ, ఆకాశ్ దీప్ బ్యాటుతో బంతిని బౌండరీకి పంపే ప్రయత్నం చేశాడు.
బంతి గాలిలోకి లేచింది. నిజానికి బంతి వెళుతున్న దిశలో అంబటి రాయుడు లేడు. పక్కన కొద్ది దూరంలో ఉన్నాడు. కానీ, ఒక్క ఉదుటున చేపపిల్లలా ముందుకు దూకేసి కుడిచేతి వేళ్లతో ఆ బంతిని పట్టుకుని కిందపడిపోయాడు. అయినా బంతి వేళ్లలోనే బందీ అయింది. అసాధ్యం లాంటి క్యాచ్ ను రాయుడు సాధ్యం చేసి చూపించాడు.