Nara Lokesh: జగన్ గారి స్పీడ్ చూస్తుంటే.. గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు: లోకేశ్
- ఇప్పటికే చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు పెంచేశారన్న లోకేశ్
- కాదేది బాదుడే బాదుడుకి అనర్హం అంటోంది వైసీపీ అంటూ వ్యాఖ్య
- ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ధరలు పెంచేందుకు ఆర్టీసీ కూడా రెడీ అయిందంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.
''వైఎస్ జగన్ గారి స్పీడ్ చూస్తుంటే.. గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు.. కాదేది బాదుడే బాదుడుకి అనర్హం అంటోంది వైసీపీ ప్రభుత్వం.
సామాన్యుడిపై పెను భారాన్ని మోపేలా పల్లె వెలుగు నుంచి ఏసీ బస్సు వరకూ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణం.
ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు కొట్టేసే విధానాలకు జగన్ రెడ్డి ఇకనైనా స్వస్తి పలకాలి'' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.