Jupiter: ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఒకే రేఖపైకి నాలుగు గ్రహాలు
- సాధారణంగా పక్కపక్కనే శుక్రుడు, అంగారకుడు
- వీటి వరుసలోకి బృహస్పతి, శని
- ఏప్రిల్ చివరికి ఒకే వరుసలోకి
- రెండేళ్ల తర్వాత మరో విడత దర్శనం
నక్షత్ర మండలం ఎన్నో వింతలకు వేదిక అని తెలిసిందే. సాధారణ రోజుల్లో తలపైకెత్తి చూస్తే శుక్రుడు (వీనస్), అంగారకుడు (మార్స్) కనిపిస్తుంటారు. ఈ రెండింటి పక్కనే సమాంతర రేఖలో మరో రెండు గ్రహాలు ఏప్రిల్ లో రానున్నాయి. అవి బృహస్పతి (జూపిటర్), శనిగ్రహం (శాటర్న్). దీంతో అరుదైన గ్రహ చతుష్టయం ఆకాశంలో దర్శనమివ్వనుంది. 2020 తర్వాత ఇలా కనిపించడం ఇదే తొలిసారి. 2020లో ఇవి మానవ కంటికి నేరుగా కనిపించాయి.
ఏప్రిల్ మధ్య నాటికి శుక్రుడు, అంగారకుడు సరసన బృహస్పతి వచ్చి చేరనుంది. ఏప్రిల్ చివరికి ఈ మూడింటి వరుసలోకి శని రానున్నాడు. జెట్ ప్రపోల్షన్ ల్యాబొరేటరీ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఇవి మన కంటికి చూడ్డానికి దగ్గరకు వచ్చినట్టు అనిపించినా. అంత దగ్గరగా ఉండవు. బిలియన్ల కిలోమీటర్ల దూరం వీటి మధ్య ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో వీటి అలైన్ మెంట్ లో వచ్చే మార్పులతో ఇలాంటి విశేషాలు ఏర్పడుతుంటాయి.