MS Dhoni: ధోనీ చేసిన చిన్న ఫీల్డింగ్ మార్పు.. కోహ్లీ అవుట్
- కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మార్పులు
- ఫీల్డర్ ను పక్కకు రావాలంటూ ధోనీ సైగలు
- ఆ వెంటనే కోహ్లీ కొట్టిన బంతిని పట్టేసిన దూబే
సీఎస్కే వైఫల్యం వెనుక కెప్టెన్ గా రవీంద్ర జడేజాకు అనుభవలేమి కూడా కారణమని తెలుస్తోంది. జట్టు పెద్దన్నగా వ్యవహరించే మహేంద్ర సింగ్ ధోనీ, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. మైదానంలో అవసరమైన సందర్భంలో జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. ఇది కొందరికి నచ్చకపోవచ్చు గాక, కానీ జడేజాకు ఇది అంగీకారమే. ఎందుకంటే జట్టు విజయం కోసం ఇద్దరూ కలసి మాట్లాడుకుంటూ ఉంటారని బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సే ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
రాయల్ చాలెంజర్స్ తో మంగళవారం నాటి మ్యాచ్ లోనూ ధోనీ మధ్యలో పలు సందర్భాలలో ఆడగాళ్ల ప్రదేశాల్లో మార్పులు చేయడం కనిపించింది. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీని అవుట్ చేసేందుకు ధోనీ వేసిన ఎత్తుగడ వెంటనే ఫలించింది. ఒకచోట మోహరించిన ఫీల్డర్ ను కొంచెం పక్కకు రావాలంటూ ధోనీ సంకేతం ఇచ్చాడు.
ఇక ఆ వెంటనే ముకేశ్ చౌదరి సంధించిన బంతిని కోహ్లీ బాదగా.. అది వెళ్లి బౌండరీ సమీపంలో ఉన్న శివమ్ దూబే చేతిలో పడిపోయింది. మూడు బంతులు ఆడిన కోహ్లీ ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోకపోయి ఉంటే.. సీఎస్కేకు ఈ దుస్ధితి వచ్చేది కాదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.