Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా రద్దు
- కేంద్రీయ విద్యాలయాల్లో ఒక్కో ఎంపీకి 10 సీట్ల కేటాయింపు
- ఎంపీల కోటాను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం
- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాలకు సంబంధించి బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున కార్యకలాపాలు సాగిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్న ఎంపీల కోటా రద్దయిపోయింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయాల నిర్వహణను పర్యవేక్షిస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు ఏటా 10 సీట్లను కేటాయిస్తున్నారు. ఈ సీట్లను ఎంపీలు తమకు అనుకూలంగా ఉన్న వారి పిల్లలకు కేటాయిస్తూ లేఖలు జారీ చేస్తున్నారు. కొందరు ఎంపీలు తమ పరిమితికి మించి కూడా సిఫారసు లేఖలు పంపుతున్నారు. కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాలకు సంబంధించి ఎంపీ కోటా సీట్ల భర్తీ కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు పెను సమస్యగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఎంపీ కోటానే ఎత్తివేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.