Pawan Kalyan: ‘మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను’ అంటూ పవన్ కల్యాణ్ పోస్ట్
- ద్రవ్యోల్బణంపై ఆర్థికవేత్త థామస్ సోవెల్ పోస్ట్
- దానిని రీట్వీట్ చేసిన పవన్ కల్యాణ్
- శేషేంద్ర పంక్తులు గుర్తుకొచ్చాయని వ్యాఖ్య
- ఆ పంక్తులను రాసుకొచ్చిన జనసేనాధిపతి
ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు బతకడమే గగనమైపోయింది. ఏది పట్టుకున్నా జేబులు ఖాళీ అయిపోతున్నాయి. జీతమొచ్చి నెల తిరగకముందే బడుగు జీవి పర్సు బరువు తగ్గిపోతోంది. అవును మరి.. పప్పులు, ఉప్పులు, నూనెలు, కూరగాయలు ఏది ఇంటికి తెచ్చినా చేతి చమురును భారీగానే వదిలించుకోవాల్సి వస్తోంది కదా.
ఈ నేపథ్యంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. థామస్ సోవెల్ అనే ఆర్థికవేత్త.. ద్రవ్యోల్బణంపై పెట్టిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు. ‘‘ద్రవ్యోల్బణం అంటే కనిపించని పన్ను. ప్రజలు దాచుకున్న సొమ్మును దోచుకోవడం. కొనుగోలు శక్తిని తగ్గించడం. కొత్త ద్రవ్యాన్ని విడుదల చేసేందుకు మళ్లీ ప్రభుత్వం వద్దకే వెళ్లే సొత్తు’’ అని థామస్ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ కు ప్రతిగా స్పందించిన పవన్ కల్యాణ్.. ఆర్థిక సమస్యలో మునిగిపోయిన సగటు మనిషిపై శేషేంద్ర కవితా పంక్తులు గుర్తొచ్చాయంటూ ట్వీట్ చేశారు. ఆ పంక్తులను ప్రజలకు వివరించారు.
‘‘వేళ్లు కాళ్లయి నడిచే చెట్టు మనిషి
చెట్టుగా ఉండే ఏడాదికి ఒక వసంతమైనా దక్కేది
మనిషినై అన్ని వసంతాలనూ కోల్పోయాను’’ అనే మాటలను పవన్ అందరికీ గుర్తు చేశారు.