War Ship: రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం... తామే దాడి చేశామన్న ఉక్రెయిన్
- ఉక్రెయిన్ పై రష్యా దాడులు తీవ్రతరం
- ఉక్రెయిన్ నగరాలపై దాడులకు భారీగా ఆయుధాల తరలింపు
- రష్యానౌకపై క్షిపణితో దాడి చేశామన్న ఉక్రెయిన్
- నౌకలో పేలుడు వల్లే నష్టం జరిగిందన్న రష్యా
తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ పై రష్యా మరింతగా విరుచుకుపడుతోంది. అందుకోసం సముద్ర మార్గం ద్వారా భారీ ఎత్తున ఆయుధ వ్యవస్థలను తరలిస్తోంది. అయితే, పెద్ద సంఖ్యలో ఆయుధ వ్యవస్థలతో ప్రయాణిస్తున్న రష్యా నౌక ఒకటి తీవ్రస్థాయిలో దెబ్బతింది. అందుకు తామే కారణమని ఉక్రెయిన్ ప్రకటించింది. ఆ రష్యా యుద్ధనౌకపై తమ బలగాలు మిస్సైల్ ను ప్రయోగించాయని పేర్కొంది.
రష్యాకు చెందిన 'మాస్క్వా క్రూజ్' నౌక ఉక్రెయిన్ తీరానికి చేరుకోగానే, తమ దళాలు క్షిపణితో దాడి చేశాయని ఒడెస్సా గవర్నర్ తెలిపారు. అయితే, రష్యా ఈ ప్రకటనను ఖండించింది. యుద్ధనౌకలో జరిగిన పేలుడు కారణంగానే నష్టం వాటిల్లిందని వెల్లడించింది. నౌకలోని సిబ్బందికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, వారిని సురక్షితంగా వెలుపలికి తరలించినట్టు రష్యా అధికారులు తెలిపారు.