Andhra Pradesh: హానికర పరిశ్రమలను ఉపేక్షించేది లేదు.. పోరస్ ప్రమాదంపై హోం మంత్రి వ్యాఖ్య
- పోరస్ బాధితులకు హోం మంత్రి తానేటి వనిత పరామర్శ
- ప్రజలకు మేలు చేసేందుకే పరిశ్రమలకు ప్రోత్సాహమని వ్యాఖ్య
- అలాంటి వాటిని ప్రోత్సహించేది లేదన్న మంత్రి వనిత
ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలను ఉపేక్షించేది లేదని, ఆ తరహా పరిశ్రమలను ప్రోత్సహించేది లేదని ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఏలూరు జిల్లా పరిధిలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడి విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి కాసేపటి క్రితం పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడే ప్రమాదం, ప్రమాదం జరిగిన తీరు, పరిశ్రమపై అక్కడి ప్రజల భావన తదితరాలపై హోం మంత్రి మాట్లాడారు.
ప్రజలకు మేలు చేయాలని, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న భావనతోనే పరిశ్రమలను ప్రోత్సహిస్తామని మంత్రి వనిత తెలిపారు. అయితే అవే పరిశ్రమలు ప్రజలకు హానికారకంగా మారితే మాత్రం ఎంతమాత్రం ఉపేక్షించమని ఆమె తెలిపారు. ప్రమాదం తర్వాత సమీప గ్రామం అక్కిరెడ్డిపల్లె వాసులు ఈ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని కోరారని, దానిపై గంటల్లోనే నివేదిక తెప్పించుకున్నామని అన్నారు. ఆ నివేదిక ప్రకారమే కంపెనీని మూసివేశామని కూడా ఆమె తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, కంపెనీ తరఫున రూ.25 లక్షలు.. మొత్తంగా రూ.50 లక్షల పరిహారాన్ని అందజేస్తామని ఆమె తెలిపారు.