BJP: ఏపీలో బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులపై జీవీఎల్ స్పందన ఇదే
- బీసీలకు ఇచ్చిన పదవులన్నీ అలంకారప్రాయమైనవేనన్న జీవీఎల్
- కొన్ని కులాలకు పదవులు ఇవ్వకుండా కక్షసాధింపు చర్యలంటూ వ్యాఖ్య
- దళితుల నిధులను పక్కదారి పట్టిస్తున్నారంటూ విమర్శ
ఏపీలో బీసీ వర్గాలకు సీఎం జగన్ ఇచ్చిన మంత్రి పదవులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు జగన్ అలంకారప్రాయమైన మంత్రి పదవులను ఇచ్చారని జీవీఎల్ అన్నారు. బీసీలకు మెజారిటీ మంత్రి పదవులు ఇచ్చామని చెబుతున్న జగన్.. కొన్ని కులాలకు మాత్రం పదవులు ఇవ్వకుండా ఆయా కులాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై జీవీఎల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేంద్ర పథకాలను అమలు చేయడం లేదని, పేద విద్యార్థుల కోసం కేంద్రం ఇచ్చే స్కాలర్షిప్లను ఏపీ ప్రభుత్వం ఆ వర్గాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. దళితుల ఉపాధి కోసం కేంద్రం ఇచ్చే నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దళిత, బడుగు వర్గాలకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని కూడా జీవీఎల్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.