Twitter: ట్విట్టర్‌ను కొనే యత్నంలో ఎలాన్ మస్క్.. విలవిల్లాడిపోతున్న టెస్లా షేర్ హోల్డర్లు
- ట్విట్టర్‌ను కొంటానంటున్న ఎలాన్ మస్క్
- రూ.3 లక్షల కోట్లను ఆఫర్ చేసిన టెస్లా చీఫ్
- డైరెక్టర్ పదవి వద్దని ట్విట్టర్ బోర్డుకు వెల్లడి
- టేకోవర్‌కు ఒప్పుకోకుంటే తన వాటా వెనక్కు తీసుకుంటానని బెదిరింపు
- మస్క్ మైండ్ గేమ్‌తో పడిపోతున్న టెస్లా షేర్ వ్యాల్యూ
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను హస్తగతం చేసుకునేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రారంభించిన యత్నాలు టెస్లా కంపెనీని ఆందోళనకర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవలే ట్విట్టర్‌లో 9.1 శాతం షేర్లను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్‌ను.. తమ డైరెక్టర్ల బోర్డులోకి ట్విట్టర్ ఆహ్వానించింది. ఈ ఆహ్వానాన్ని తిరస్కరించిన మస్క్... ట్విట్టర్‌ను పూర్తిగా తనకు అమ్మేయాలంటూ ఓ బేరం పెట్టేశారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేసేందుకు మస్క్ ఏకంగా రూ.3 లక్షల కోట్లను ఆఫర్ చేసినట్టు సమాచారం.
ఈ వార్త బయటకు వచ్చినంతనే టెస్లా షేర్ విలువ పతనం ప్రారంభమైంది. ట్విట్టర్ యాజమాన్యం మస్క్ ప్రతిపాదనకు ఓకే చెబితే.. నిధుల సమీకరణలో భాగంగా టెస్లాలోని తన షేర్లను మస్క్ అమ్మేయడం ఖాయమన్నదే టెస్లా షేర్ హోల్డర్ల భయంగా తెలుస్తోంది. ఇప్పటికే 30 డాలర్లకు టెస్లా షేర్ పతనమైపోయింది. ఈ వార్తలు ఇలాగే కొనసాగితే టెస్లా షేర్ మరింతగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదన్న భయాలు కూడా టెస్లా షేర్ హోల్డర్లను భయపెడుతున్నాయి. మరోవైపు మస్క్ ప్రకటనలో ట్విట్టర్ షేర్ విలువ దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే... ఏదేనీ కంపెనీకి ఓపెన్ ఆఫర్ ఇవ్వాలంటే... ఆ కంపెనీలో 25 శాతం షేర్లు కలిగి ఉండాలి. మరి ట్విట్టర్‌లో కేవలం 9.1 శాతం షేర్లతోనే మస్క్ ఓపెన్ ఆఫర్‌కు దిగుతున్నారంటే. అతిత్వరలోనే 25 శాతం వాటా దక్కించుకునేందుకు కూడా ఆయన వెనుకాడరన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు తన ఆఫర్‌ను మన్నించకుంటే... ట్విట్టర్‌లో తాను కొనుగోలు చేసిన 9.1 శాతం వాటాను వెనక్కు తీసుకోవడానికి కూడా వెనుకాడేది లేదని కూడా మస్క్ బెదిరిస్తున్నారట. మొత్తంగా మస్క్ ఆడుతున్న మైండ్ గేమ్‌తో ట్విట్టర్ షేర్ విలువ అమాంతంగా పెరిగిపోతుండగా.. ఆయన సొంత కంపెనీ టెస్లా షేర్ విలువ మాత్రం అమాంతంగా పడిపోతోంది.