Mahela Jayawardene: రోహిత్ శర్మ ఫాంపై ఎలాంటి ఆందోళన లేదంటున్న ముంబయి ఇండియన్స్ కోచ్
- ఐపీఎల్ తాజా సీజన్ లో ముంబయి ఘోర వైఫల్యం
- వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓటమి
- భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న రోహిత్ శర్మ
- 5 మ్యాచ్ ల్లో 108 పరుగులు
- కాలమే సమస్యను పరిష్కరిస్తుందన్న మహేల
ఐపీఎల్ లో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టుకు... తాజా సీజన్ లో ఆడుతున్న ముంబయి ఇండియన్స్ కు ఏమాత్రం పోలికలేదు. ముంబయి జట్టు అత్యంత పేలవ ఆటతీరుతో ఒక్కసారిగా అట్టడుగుస్థాయికి పడిపోయింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన ముంబయి ఇండియన్స్ ఐదు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది.
గతంలో జట్టుకు మూలస్తంభంలా నిలిచి, విజయాల్లో ముఖ్యభూమిక పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు సాధించేందుకు ఇబ్బందిపడుతున్నాడు. ఒకట్రెండు భారీ షాట్లు కొట్టి బాగా ఆడుతున్నాడు అనుకునేంతలో వికెట్ అప్పగిస్తూ, జట్టుపై ఒత్తిడికి పరోక్షంగా కారణమవుతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించాడు. రోహిత్ శర్మ ఫాంపై తనకెలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. కాలంతో పాటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించాడు. రోహిత్ శర్మ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాడంటే అన్నీ సర్దుకుంటాయని మహేల అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తాజా సీజన్ లో ఐదు మ్యాచ్ ల్లో కేవలం 108 పరుగులు చేశాడు. సగటు 21.60.
"రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న విధానం, బంతిని కొడుతున్న పద్ధతి ఎంతో బాగుంది. కానీ, రోహిత్ శుభారంభాలను వ్యక్తిగత భారీ స్కోరుగా మలచడంలో నిరుత్సాహానికి గురిచేస్తున్నాడు. రోహిత్ బ్యాటింగ్ లోతెంతో మాకు తెలుసు. అతడు గనుక 15 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాడంటే స్కోరుబోర్డు పరుగులు పెడుతుంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రోహిత్ నాణ్యమైన ఆటగాడు. అందుకే అతడి బ్యాటింగ్ ఫాంపై ఎలాంటి ఆందోళన లేదు" అని మహేల వివరించాడు.