Kim Jong Un: కిమ్ అంతే... వార్తలు చదివే మహిళకు కానుకగా లగ్జరీ విల్లా... వీడియో ఇదిగో!
- కేసీటీవీలో న్యూస్ రీడర్ గా రీ చున్ హై
- 70వ దశకం నుంచి పనిచేస్తున్న వైనం
- ఉత్తర కొరియా చరిత్రలో అనేక కీలక ఘట్టాలకు సాక్షి
- లగ్జరీ విల్లాకు విచ్చేసిన కిమ్
- న్యూస్ రీడర్ చేయి పట్టుకుని ఇల్లంతా చూపించిన అధినేత
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చితే నెత్తిన పెట్టుకునే కిమ్, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా అంతమొందిస్తాడు. తాజాగా, ప్రభుత్వ టీవీ చానల్లో వార్తలు చదివే ఉద్యోగినిని అనుకోని రీతిలో సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
కొరియన్ సెంట్రల్ టెలివిజన్ (కేసీటీవీ)లో రీ చున్ హై ఎంతో కాలంగా న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు. సంప్రదాయ గులాబీ రంగు దుస్తుల్లో కనిపించే ఆమెను ఉత్తర కొరియన్లు 'పింక్ లేడీ'గా పిలుచుకుంటారు. ఉత్తర కొరియా చరిత్రలో అనేక కీలక ఘట్టాలను ప్రజలకు తెలియజేసిన ప్రభుత్వ గొంతుక ఆమె. 70వ దశకం ప్రారంభం నుంచి ఆమె కేసీటీవీలో పనిచేస్తున్నారు. అయితే రీ చున్ హై సేవలను కిమ్ జాంగ్ ఉన్ గుర్తించారు.
తాజాగా ఆమెకు ఓ లగ్జరీ విల్లాను బహూకరించారు. రాజధాని నగరం ప్యోంగ్యాంగ్ లో ఉన్నతవర్గాల కోసం నిర్మించిన ఓ టౌన్ షిప్ లోని ఆ విలాసవంతమైన ఫ్లాట్ కు కిమ్ కూడా విచ్చేశారు. 79 ఏళ్ల రీ చున్ హై మెట్లు ఎక్కేందుకు ఇబ్బందిపడడంతో కిమ్ స్వయంగా చేయందించి ఇల్లంతా కలియదిప్పి చూపించారు. ఇకపైనా ప్రభుత్వం తరఫున తన గొంతుకను వినిపించాలంటూ కిమ్... రీ చున్ హైని కోరారు. కాగా, ఊహించని రీతిలో ప్రభుత్వం నుంచి తనకు అందిన ఇంటిని చూసి ఆ సీనియర్ న్యూస్ రీడర్ మురిసిపోయారు.