Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన మరో కొత్త పార్టీ
- ‘జై భీమ్ భారత్ పార్టీ’ ని ప్రారంభించిన జడ శ్రవణ్‌కుమార్
- రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని వ్యాఖ్య
- వైసీపీలోని దళిత నేతలను ఓడించడమే లక్ష్యమన్న శ్రవణ్
- వైసీపీ దుర్మార్గ పాలనను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని పిలుపు
‘జై భీమ్ భారత్ పార్టీ’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ వచ్చేసింది. విజయవాడలో నిన్న సాయంత్రం జడ శ్రవణ్‌కుమార్ ఈ పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు నిర్వహించిన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందన్నారు. 28 సంవత్సరాలకే న్యాయమూర్తి అయిన తాను పదేళ్లలోనే ఆ పదవిని వదిలి వచ్చేశానని చెప్పారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత బిడ్డలకు తాను మేనమామలా ఉంటానని హామీ ఇచ్చిన జగన్.. ఆ తర్వాత వారికి చేసిన అన్యాయాన్ని ఎప్పటికీ మర్చిపోబోమన్నారు. వైసీపీలోని దళిత నేతలను ఓడించేందుకే పార్టీని పెడుతున్నట్టు పేర్కొన్నారు. దళితులకు అందే 26 రకాల పథకాలను జగన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడిపో, ఓడించు, గెలువు అన్న కాన్షీరాం మాటలే తనకు స్ఫూర్తి అని శ్రవణ్ కుమార్ అన్నారు. రూపాయికి కిలో బియ్యం, రూ. 200కు నూనె ప్యాకెట్ ఇచ్చే వారిని పొగుడుదామా? అని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నించకుండా వదలనని శ్రవణ్ కుమార్ తేల్చిచెప్పారు.