Ukraine: పెద్ద నాయకులు కూడా అధికారం తమ చేతిలో లేదన్నట్టు వ్యవహరించారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
- అనేక పశ్చిమ దేశాల నేతలతో సంప్రదింపులు జరిపామన్న అధ్యక్షుడు
- చాలా మంది నుంచి సరైన స్పందన రాలేదని ఆవేదన
- ఈ 50 రోజుల పోరాటం ఉక్రెయిన్ ఘనతేనన్న జెలెన్ స్కీ
ప్రపంచంలోని కొందరు కీలక దేశాధినేతలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శలు గుప్పించారు. రష్యా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో తాము అనేక పశ్చిమ దేశాల నేతలతో సంప్రదింపులు జరిపినప్పటికీ.. పలువురి నుంచి సరైన స్పందన రాలేదని అన్నారు. కొందరు పెద్ద నేతలు తమ చేతుల్లో అధికారం లేదన్నట్టుగా వ్యవహరించారని చెప్పారు. మేటి రాజకీయవేత్తల కన్నా రాజకీయాల్లో లేని వారే ఈ 50 రోజుల్లో ఎంతో చేశారని తెలిపారు.
రష్యా చేస్తున్న యుద్ధం 50 రోజులు దాటిందని... ఆ దేశ దాడులను ఉక్రెయిన్ 50 రోజుల పాటు ఎదుర్కొందని జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న వారికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఈ 50 రోజుల పోరాటం అనేది ఉక్రెయిన్ ఘనత అని చెప్పారు. ఇది లక్షల సంఖ్యలో ఉన్న ఉక్రేనియన్ల విజయమని అన్నారు. రష్యా యుద్ధ నౌకలు పాతాళానికి పోవాల్సిందేనని చెప్పారు. ఉక్రెయిన్ మోసం చేయదు, తల వంచదని అన్నారు.