Covid: కొత్త రూపంలో కరోనా .. ఈ లక్షణాలపై కన్నేయండి..!
- దేశంలో నమోదైన ఎక్స్ఈ కేసులు
- జులై నాటికి మరో వేవ్ ఉందంటున్న నిపుణులు
- గొంతునొప్పి, ముక్కు కారటం, తలనొప్పి లక్షణాలు
- ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుల వద్దకు వెళ్లాలి
కరోనా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. కొత్తగా ఎక్స్ఈ వేరియంట్ కేసులు దేశంలో రెండు వెలుగు చూశాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ నాలుగో విడత జూన్ లేదా జులై నుంచి మొదలవుతుందని కొద్ది మంది నిపుణులు అంచనా వేస్తుంటే.. కొందరు మాత్రం ఇంకో వేవ్ ఉండదంటున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ కు సంబంధించి లక్షణాలపై అవగాహన కలిగి ఉంటే, ద్వారా వెంటనే స్పందించేందుకు వీలుంటుంది.
కరోనా వైరస్ ఇప్పటికీ పెద్ద మహమ్మారిగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది. సంక్షోభం మధ్య దశలోనే ఉన్నామని, టీకాలు తీసుకోని, రక్షణ చర్యలు పాటించని వారికి ఇది ప్రాణాంతకం అవుతుందని హెచ్చరించింది. కానీ, భయపడాల్సిన పని లేదని, అదే సమయంలో స్వీయ జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ లోనే పలు ఉప రకాల కేసులు కొన్ని దేశాల్లో నమోదవుతున్నాయి. ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్, ఎక్స్ డీ ఇలా కొత్త రకాలు వచ్చాయి. ఒమిక్రాన్ ఉపరకాల కలయికతో ఏర్పడినవే ఇవి. ఇందులో ఎక్స్ఈ రకానికి వేగంగా వ్యాపించే లక్షణం ఎక్కువని తేలింది.
కరోనా వైరస్ లో లక్షణాలను గుర్తించడం కీలకం. ఎక్కువ మందిలో గొంతు నొప్పి లేదా మంట, ముక్కు కారటం, దగ్గు, తలనొప్పి, అలసట కనిపిస్తుంటాయి. మొదటి విడతలో వాసన, రుచి తెలియలేదు కానీ, ఆ తర్వాత వేరియంట్లలో ఈ లక్షణాలు కనిపించలేదు. గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడినవారు, కరోనా టీకాలు తీసుకున్న వారికి బలమైన రక్షణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్లూ వైరస్ లలో ముందుగా కనిపించేది గొంతు నొప్పి, మంటే. కరోనా వైరస్ లోనూ ఇదే ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతో రెండింటి మధ్య తేడాను గుర్తించడం కష్టం. అయితే, కరోనా వైరస్ ఎక్కువ కేసుల్లో గొంతునొప్పి నాలుగైదు రోజుల్లోనే తగ్గిపోతోంది. దీన్ని పరిశీలించుకోవాలి. ఈ లక్షణాల్లో ఏది కన్పించినా సొంత వైద్యం కాకుండా, వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవడమే మెరుగైన పరిష్కారం అవుతుంది.