gutta sukhendar: జాతీయ పార్టీలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి
- దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనించాలన్న గుత్తా
- ఓట్ల రాజకీయలను మానుకోవాలని హితవు
- ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడాలని వ్యాఖ్య
బీజేపీ, కాంగ్రెస్ నేతలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనించాలని అన్నారు. ఓట్ల రాజకీయలను మానుకోవాలని, ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడాలని హితవు పలికారు.
తెలంగాణలో పండించిన వడ్లను కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసిందని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడం వల్ల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నందుకుగాను సీఎం కేసీఆర్‌కు రైతులందరి పక్షాన బీజేపీ కూడా కృతజ్ఞతలు తెలపాలని అన్నారు.
మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యాన్ని కొనేలా చేశామని చెప్పుకునే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం సరైనదేనని తెలిపారు.