mosque: లౌడ్ స్పీకర్ల విషయంలో ముంబై మసీదు చక్కటి నిర్ణయం
- నిబంధనలను పాటించాలని నిర్ణయం
- శబ్దాల స్థాయి పరిమితి మేరకు తగ్గింపు
- మిరా రోడ్డులోని జామా మసీదు నిర్ణయం
- స్పీకర్లు తొలగించేది లేదని స్పష్టీకరణ
మసీదుల్లో అజాన్ సమయంలో పెద్ద సౌండ్ తో లౌడ్ స్పీకర్లు పెట్టడంపై దేశవ్యాప్తంగా ఇతర మత వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ముంబైలోని ఒక మసీదు కీలక నిర్ణయం తీసుకుంది. మిరా రోడ్డులోని జామా మసీదు అల్ షామ్స్.. లౌడ్ స్పీకర్ల నుంచి బయటకు వచ్చే శబ్దాన్ని నిబంధనలకు అనుగుణంగా తగ్గించాలని నిర్ణయించింది.
మిరా రోడ్డులోని జామా మసీదు చీఫ్ ముజఫర్ హుస్సేన్ స్పందిస్తూ.. రోజులో ఐదు పర్యాయాలు అజాన్ చేసే సమయంలో లౌడ్ స్పీకర్ల నుంచి విడుదలవుతున్న శబ్దాల స్థాయిని ఇంజనీర్లు అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత శబ్దాల స్థాయిని.. వాణిజ్య ప్రాంతాల్లో నిబంధనల కింద అనుమతించిన మేరకు తగ్గించేస్తామని ప్రకటించారు. తమ మసీదు వాణిజ్య ప్రాంతం పరిధిలోకి వస్తుందన్నారు.
మరోపక్క, మే 3 నాటికి మసీదులపై స్పీకర్లను తొలగించాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ఇప్పటికే హెచ్చరికలు చేశారు. లేదంటే మసీదుల ముందు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. దీనిపై హుస్సేన్ మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం లేదని గుర్తు చేశారు.
ప్రార్థనా స్థలాల నుంచి లౌడ్ స్పీకర్లు ఎవరూ తొలగించలేరని, అందరూ నిబంధనలకు కట్టుబడాలని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కొన్ని హిందూ సంస్థలు మసీదుల లౌడ్ స్పీకర్లు తొలగించాలని, లేదంటే తాము హనుమాన్ చాలీసాను పెద్దగా స్పీకర్లలో పెడతామంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.