Thopudurthi Prakash Reddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణమిదే: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
- జిల్లాలోని సమీకరణలు, సామాజిక సమీకరణలే కారణమన్న ప్రకాశ్ రెడ్డి
- జిల్లాలోనే అతి పెద్ద నియంతృత్వ కుటుంబాన్ని మట్టి కరిపించామని కామెంట్
- మంత్రి పదవి కోసం నేను ఎదురు చూడటం లేదని స్పష్టీకరణ
ఏపీలో ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విస్తరణలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంతో మందికి నిరాశ ఎదురైంది. మంత్రి పదవులు కోల్పోయిన వారు కూడా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
మరోవైపు, ఈ సారి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంచనా వారిలో అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్యెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కూడా ఉన్నారు. పరిటాల రవి కుటుంబాన్ని ఎదుర్కొంటూ వస్తున్న ఆయనకు బెర్త్ ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే, ఆయనకు అవకాశం దక్కలేదు.
ఈ నేపథ్యంలో తోపుదుర్తి మాట్లాడుతూ తనకు మంత్రి పదవి రాకపోవడానికి గల కారణాన్ని వివరించారు. జిల్లాలోని సమీకరణలు, సామాజిక సమీకరణల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని చెప్పారు. జిల్లాలోనే అతి పెద్ద నియంతృత్వ కుటుంబాన్ని మట్టికరిపించామని అన్నారు.
రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం మాత్రం తనకు దక్కలేదని అన్నారు. తనతో ఉండాలని వైయస్సార్ చనిపోయిన మూడో రోజే జగన్ తనకు చెప్పారని... అందుకే మంత్రి పదవి కోసం తాను ఎదురు చూడటం లేదని అన్నారు. ఏపీలో ప్రస్తుతం రెండో స్థానంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారని, మూడో స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని తోపుదుర్తి చెప్పారు.