TSRTC: ఈ సారి రిజర్వేషన్ టికెట్ల వంతు... టీఎస్ఆర్టీసీ మరోమారు చార్జీల పెంపు
- ఒక్కో రిజర్వేషన్ టికెట్ పై రూ.20 నుంచి 30 మేర పెంపు
- ఇటీవలే డీజిల్ సెస్ పేరిట చార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ
- అంతకుముందు రెండు సార్లు చార్జీలను పెంచిన సంస్థ
ఇప్పటికే పలుమార్లు పలు రకాల సేవల పేరిట బస్సు చార్జీలను పెంచేసిన టీఎస్ఆర్టీసీ శుక్రవారం మరోమారు చార్జీలను పెంచింది. ఈ దఫా నేరుగా బస్సు చార్జీలను కాకుండా రిజర్వేషన్ టికెట్లపై చార్జీలను పెంచుతూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఒక్కో రిజర్వేషన్ టికెట్‌పై రూ.20 నుంచి రూ.30 మేర పెంచుతూ టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఓ రెండు దఫాలుగా నేరుగా బస్సు చార్జీలను పెంచిన టీఎస్ఆర్టీసీ ఇటీవలే డీజిల్ సెస్ పేరిట మరోమారు చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసుల్లో కనీస చార్జీని రూ.10లకు పెంచుతూ కూడా సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా రిజర్వేషన్ చార్జీలను కూడా పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.