Joe Root: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జో రూట్
- పరాజయాల బాటలో ఇంగ్లండ్ టెస్టు జట్టు
- వెస్టిండీస్ చేతిలోనూ ఓటమి
- రూట్ కెప్టెన్సీపై విమర్శలు
- ఆటగాడిగానూ రూట్ పై భారం
ఇటీవల కాలంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తుండగా, ఆ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి స్టార్ ఆటగాడు జో రూట్ వైదొలిగాడు. రూట్ గత ఐదేళ్లుగా ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు. రూట్ నాయకత్వంలో ఇంగ్లండ్ 64 టెస్టులాడి 27 విజయాలు, 26 ఓటములు నమోదు చేసింది.
ఇటీవల కాలంలో టెస్టుల్లో ఇంగ్లండ్ ఆటతీరు నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారైంది. చివరి 17 టెస్టుల్లో ఇంగ్లండ్ ఒకే ఒక్కదాంట్లో గెలిచిందంటే ఆ జట్టు ఎంత ఘోరమైన ఆటతీరు కనబరుస్తోందో అర్థమవుతుంది. బలహీన వెస్టిండీస్ చేతిలోనూ ఓడిపోవడం ఇంగ్లండ్ పేలవ ఆటతీరుకు పరాకాష్ఠ. దానికితోడు జో రూట్ ఆట కూడా దెబ్బతిన్నది. గతంలో అలవోకగా సెంచరీలు సాధించిన రూట్... ఇప్పుడు కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే తన బ్యాటింగ్ ను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
రూట్ క్లాస్ ఉన్న ఆటగాడు కావడంతో 2021 సీజన్ లో ప్రతికూల పరిస్థితుల్లోనూ 1,708 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే, కెప్టెన్సీ భారం అంతకంతకు పెరిగిపోతోందని భావించిన రూట్ తాజాగా రాజీనామా నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కెప్టెన్ గా కొనసాగలేనని రూట్ ఓ ప్రకటనలో వెల్లడించాడు.
ఇది ఎంతో కఠిన నిర్ణయం అయినప్పటికీ, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని వివరించాడు. ఇంగ్లండ్ జట్టుకు సారథిగా వ్యవహరించడం పట్ల గర్విస్తున్నానని, ఇంగ్లండ్ క్రికెట్ ను సమున్నతస్థాయికి తీసుకెళ్లడంలో బాధ్యతగా వ్యవహరించానని భావిస్తున్నానని రూట్ పేర్కొన్నాడు.
కొంతకాలంగా కెప్టెన్సీ తన ఆటతీరును ప్రభావితం చేస్తోందని, అయితే, అంతర్జాతీయ క్రికెట్ లో ఆడడాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. ఇంగ్లండ్ జట్టుకు కొత్త కెప్టెన్ గా ఎవరు నియమితులైనా తన సంపూర్ణ సహకారం అందిస్తానని, జట్టు సహచరులు, కోచ్ లకు తన నుంచి మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్ సారథిగా ఉన్న సమయంలో రూట్ 64 టెస్టులాడి 5,295 పరుగులు చేశాడు. వాటిలో 14 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలిస్టర్ కుక్ కెప్టెన్ గా తప్పుకున్న అనంతరం 2017లో జో రూట్ ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ గా నియమితుడయ్యాడు.