AP Cabinet: కొత్త మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం
- శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు
- స్వామి వారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం
- అదే సమయంలో అక్కడికి వచ్చిన కొట్టు సత్యనారాయణ
- మంత్రిని చూడగానే ఆయనకు వ్యతిరేకంగా భక్తుల నినాదాలు
ఏపీలో కొత్తగా దేవాదాయశాఖ మంత్రి పదవిని చేపట్టిన కొట్టు సత్యనారాయణకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. శ్రీ బాలాజీ జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తి ఆలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రిని చూడగానే భక్తులంతా ఒక్కసారిగా ఆయనకు వ్యతిరేకంగా గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో మంత్రి షాక్ తిన్నారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తిన సంగతి తెలిసిందే. అదే మాదిరిగా శ్రీకాళహస్తికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ క్రమంలో భారీ రద్దీ నేపథ్యంలో స్వామి వారి దర్శనానికి ఏకంగా 4 గంటలకు పైగానే సమయం పడుతోంది. అయినా భక్తులు క్యూలైన్లలోనే ముందుకు సాగుతున్నారు.
అదే సమయంలో మంత్రి హోదాలో కొట్టు సత్యనారాయణ అక్కడికి వచ్చారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి వచ్చిన విషయాన్ని గ్రహించిన భక్తులు ఒక్కసారిగా నినాదాలు అందుకున్నారు. మంత్రిగారూ గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.