Kushboo: మహిళ అయివుండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?: మమతా బెనర్జీపై ఖుష్బూ ఫైర్
- పశ్చిమబెంగాల్ లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
- ప్రేమ వ్యవహారం ఉంది అన్న మమత
- మండిపడుతున్న విపక్షాలు
పశ్చిమబెంగాల్ లోని హన్స్ ఖాలీ లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. మరోవైపు ఈ ఘటనకు టీఎంసీ నేత కుమారుడే కారణమని మృతురాలి కుటుంబం ఆరోపించింది.
ఈ క్రమంలో ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె అత్యాచారానికి గురయిందా? లేక ప్రేమ వ్యవహారం కారణమా? అనే విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలుసని అన్నారు. ఒకవేళ వారు ప్రేమలో ఉంటే వారిని తానెలా ఆపగలను? అని సీఎం ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు విపక్షాలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
మరోవైపు ఐదుగురు సభ్యులతో కూడిన బీజేపీ నిజనిర్ధారణ కమిటీ ఈరోజు హన్స్ ఖాలీలో పర్యటించింది. ఈ ఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు గాను మమత క్షమాపణ చెప్పాలని కమిటీ డిమాండ్ చేసింది. టీఎంసీ ప్రభుత్వంలో న్యాయం కనుమరుగైపోతోందని వ్యాఖ్యానించింది.
ఇక ఈ కమిటీలో సభ్యురాలైన బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మాట్లాడుతూ... 14 ఏళ్ల బాలిక హత్యాచారాన్ని పక్కదోవ పట్టించేందుకు మమతా బెనర్జీ దారుణమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఒక మహిళవు అయివుండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు.