Telangana: 3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్... ఈ రాత్రికి ముగియనున్న గడువు
- ప్రభుత్వానికి రూ.300 కోట్ల మేర ఆదాయం
- 65 శాతం పైగా పెండింగ్ చలాన్ల క్లియర్
- మరోమారు పొడిగింపు లేదన్న పోలీసు శాఖ
తెలంగాణలో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ గడువు ఈ రాత్రితో ముగియనుంది. మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌లో భారీ రాయితీలు ప్రకటించడంతో వాహనదారులు తమతమ చలాన్ల క్లియరెన్స్ కోసం ఎగబడ్డారు.
ఈ క్రమంలో మార్చి 31తో గడువు ముగియనుందనగా.. మరో 15 రోజుల పాటు గడువును పొడిగిస్తూ తెలంగాణ పోలీసు శాఖ ఆమధ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువు కూడా శుక్రవారం (ఏప్రిల్ 15) రాత్రి 12 గంటలకు ముగియనుంది. మరోమారు గడువును పొడిగించే ప్రసక్తే లేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌లో భాగంగా ఇప్పటిదాకా 3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. పెండింగ్ చలాన్లు క్లియరెన్స్‌తో ప్రభుత్వానికి రూ. 300 కోట్ల ఆదాయం సమకూరింది. 65 శాతం పైగా పెండింగ్ చలాన్లను వాహనదారులు క్లియర్ చేశారు. టూ వీలర్లకు 75 శాతం, కార్లకు 50 శాతం మేర రాయితీని ప్రకటిస్తూ తెలంగాణ పోలీసు శాఖ జారీ చేసిన ప్రకటనకు వాహనదారుల నుంచి భారీ స్పందనే లభించింది.