- సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన డిమాండ్
- మే 3 నాటికి మసీదులపై స్పీకర్లు తొలగించాల్సిందేనని అల్టిమేటం
- లేదంటే హనుమాన్ చాలీసా వినిపిస్తామని ప్రకటన
మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ మహారాష్ట్రలో ఉద్యమం తలపెట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. మసీదులపై లౌడ్ స్పీకర్లు తీసివేయించాలని కోరింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది.
మసీదులపై ఉన్న లౌడ్ స్పీకర్లను మే 3 నాటికి తొలగించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ థాకరే లోగడ అల్టిమేటం ఇచ్చారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, లౌడ్ స్పీకర్లు తొలగించాల్సిందేనని తాజాగా రాజ్ థాకరే మరోసారి స్పష్టం చేశారు. మే 3 నాటికి మసీదులపై లౌడ్ స్పీకర్లను శివసేన ఆధ్వర్యంలోని సర్కారు తొలగించకపోతే.. మసీదుల ముందు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు హన్ మాన్ చాలీసా పారాయణం వినిపిస్తారని ప్రకటించారు.
ఎవరి ప్రార్థనలకూ తాము వ్యతిరేకం కాదని రాజ్ థాకరే స్పష్టం చేశారు. లౌడ్ స్పీకర్ల వల్ల ప్రజలకు ఎంతో అసౌకర్యం కలుగుతోందంటూ.. ప్రార్థనలు ఏవైనా వారి నివాసాల్లోనే ఆచరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని కోరారు.