Jogi Ramesh: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోగి రమేశ్... కీలక అంశాలపై తొలి సంతకాలు
- గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రమేశ్
- విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్లు కట్టించే ఫైల్‌పై తొలి సంతకం
- గృహాలకు సిమెంట్ కేటాయింపులు పెంచుతూ రెండో సంతకం
ఇటీవల ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ శనివారం నాడు గృహనిర్మాణ శాఖ పదవీ బాధ్యతలు చేపట్టారు. అమరావతి, సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రమేశ్.. తొలి రెండు సంతకాలను రెండు కీలక అంశాలకు చెందిన ఫైళ్లపై చేశారు. విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్లు కట్టించే అంశంపై తొలి సంతకం చేసిన రమేశ్.. గృహ నిర్మాణ లబ్దిదారులకు ఇచ్చే 90 బస్తాల సిమెంట్‌ను 140 బస్తాలకు పెంచుతూ రెండవ సంతకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి రమేశ్ సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్ అభినవ పూలే అని, అంబేద్కర్ అసలైన వారసుడు అని కీర్తించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రమేశ్‌కు తాజా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తదితరులు అభినందనలు తెలిపారు.