COVID19: డెల్టా, ఒమిక్రాన్ ను అణచివేసే ‘వెచ్చటి’ భారత వ్యాక్సిన్!
- ఐఐఎస్సీ, మిన్ వ్యాక్స్ కలిసి రూపకల్పన
- 37 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నిల్వ
- 100 డిగ్రీల వద్ద 90 నిమిషాల పాటు ఉండగల శక్తి
కరోనాకు ఇప్పుడు ఎన్నో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటన్నింటినీ చల్లటి వాతావరణంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. వేడి తగిలితే అవి పాడైపోతుంటాయి. ఫైజర్ వ్యాక్సిన్ నైతే మైనస్ 70 డిగ్రీల శీతల స్థితుల్లో పెట్టాల్సి ఉంటుంది.
మరి, ఎర్రటి ఎండల్లోనూ పాడుకాని వ్యాక్సిన్ వస్తే..? అలాంటి వ్యాక్సిన్నే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బయోటెక్ స్టార్టప్ కంపెనీ మిన్ వ్యాక్స్ లు కలిసి ఆస్ట్రేలియా కామన్ వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సహకారంతో తయారు చేసిన వ్యాక్సిన్ ను 100 డిగ్రీల తీవ్ర ఉష్ణ పరిస్థితుల్లోనూ 90 నిమిషాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఎన్నో రోజుల పాటు 37 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచుకోవచ్చు.
ఇక, కరోనా వైరస్ వేరియంట్లు డెల్టా, ఒమిక్రాన్ లపై ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే డెల్టాపై రెండున్నర రెట్లు, ఒమిక్రాన్ పై 16.5 రెట్లు సమర్థంగా పనిచేస్తుందని అంటున్నారు.
ఈ వ్యాక్సిన్ పై త్వరలోనే ఫేజ్ 1 మానవ ప్రయోగాలు చేస్తామని చెప్పారు. కాగా, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న దేశాలు, ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ను రవాణా చేసేందుకు సులువుగా ఉంటుందని చెబుతున్నారు. కాగా, ఇప్పటికీ ఆఫ్రికా వంటి పేద దేశాలకూ వ్యాక్సిన్ సమానంగా అందడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాక్సిన్ ఆ దేశాలకు ఓ వరమని చెప్పవచ్చు.