YSRCP: వైసీపీ జాబ్ మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు.. 147 కంపెనీల హాజరు
- తిరుపతి ఎస్వీ వర్సిటీలో జాబ్ మేళా
- భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
- విశేష స్పందనపై విజయసాయిరెడ్డి ట్వీట్
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఆధ్వర్యంలో శనివారం నాడు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వేదికగా మొదలైన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. రాయలసీమకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో శనివారం నాడు ఏకంగా 147 కంపెనీలు పాల్గొన్నాయి. ఆదివారం కూడా ఈ జాబ్ మేళా కొనసాగనుంది.
ఈ సందర్భంగా జాబ్ మేళాకు వచ్చిన విశేష స్పందనను ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. తిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు రాయలసీమ నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన వస్తోందని చెప్పారు. జాబ్ మేళాలో ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో, కియామోటార్స్ తదితర 147 కంపెనీలు యువతకు ఉద్యోగాలిస్తున్నాయని చెప్పారు. ఉద్యోగార్థులందరూ వారి విద్యార్హతకు తగిన మంచి ఉద్యోగాలు పొందాలని మనసారా కోరుకుంటున్నానంటూ విజయసాయిరెడ్డి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.